సంచలన నిర్ణయం తీసుకున్న దుబాయ్ యువరాణి ... బిడ్డపుట్టిన 2 నెలలకే విడాకులు!!

వరుణ్

బుధవారం, 17 జులై 2024 (19:42 IST)
దుబాయ్ యువరాణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనించిన రెండు నెలలకే విడాకులు ప్రకటించారు. ఆమె పేరు షైకా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్. దుబాయ్ యువరాణి. యూఏఈ ప్రధానమంత్రి కుమార్తె. షైకా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనం సృష్టించింది. యువరాణి షైకా.. యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె కావడం గమనార్హం. 
 
దుబాయ్‌కి చెందిన సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌తో యువరాణి షైకా వివాహం గత 2023 మే 27వ తేదీన జరిగింది. ఇటీవలే షైకా, మనా దంపతులకు తొలి సంతానం కూడా కలిగింది. వీరిద్దరూ అంతలోనే విడాకులు తీసుకుంటున్నట్టు యువరాణి షైకా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
అది కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మాజీ భార్య అంటూ సంచలనం పోస్టు పెట్టారు. 
 
కాగా, షైకా, మనా ఇద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దుబాయ్ యువరాణి బ్రిటన్‌లోని ప్రముఖ విద్యా సంస్థలో చదువుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిలా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు