అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఇప్పటికే హెచ్ 1బి వీసాలపై భారతీయుల్లో ఆందోళన నెలకొనివుంది. ఈ నేపథ్యంలో... హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారి జీవితభాగస్వాములకు వర్క్ పర్మిట్‌పై ఇపుడు గుబులు మొదలైంది.
మాజీ అధ్యక్షుడు ఒబామా అధికారంలో ఉన్నప్పుడు హెచ్-1బీ వీసాలున్న వారి జీవితభాగస్వాములకు పనిచేసే అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు అమెరికన్ సంస్థలు వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని స్పందించాల్సిందిగా అడిగింది. అయితే ఈ విషయంపై స్పందించడానికి 60 రోజుల సమయం కావాలని ట్రంప్ యంత్రాంగం కోరింది. దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని హెచ్-1బీ వీసాలపై వెళ్లిన భారతీయుల్లో ఉత్కంఠ నెలకొంది.