దాడికి దిగితే అణు యుద్ధమే : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్

ఠాగూర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (11:02 IST)
తమ దేశంపై ఎవరైనా దాడికి దిగితే అణు యుద్ధం తప్పదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. గత కొంతకాలంగా క్షిపణి పరీక్షలు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్ డ్రోన్‌ వంటి పరీక్షలతో ఉత్తర కొరియా నిత్యం ఆయుధ సంపత్తిని భారీగా సమకూర్చుకుంటుంది. ఇది పొరుగు దేశం దక్షిణ కొరియాతో పాటు అగ్రరాజ్యం అమెరికా ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఉత్తర కొరియాపై ఏ క్షణమైనా దాడికి దిగొచ్చంటూ ప్రచారం సాగుతుంది. దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ ఘాటుగా స్పందించారు. పాంగ్యాంగ్‌పై దక్షిణ కొరియా, దాని మిత్రపక్షమైన అమెరికా దాడికి దిగితే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా అణు దాడికి దిగుతామని హెచ్చరించారు. 
 
'ఒక వేళ శత్రువులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై నిస్సంకోచంగా అణ్వాయుధాలతో విరుచుకుపడతాం' అని కిమ్‌ పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. పాగ్యాంగ్‌లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్‌ సందర్శించిన అనంతరం వ్యాఖ్యానించారు. 
 
'ఉత్తర కొరియా ఒకవేళ తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఎదుర్కొంటాం. ఆ రోజుతో ఉత్తర కొరియా పాలన ముగుస్తుంది' అని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా కిమ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
 
ఇక, ఇటీవలికాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మే చివరి వారం నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ దృశ్యాలను ఓ మీడియా సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
 
అదేవిధంగా అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చెపట్టాలని కిమ్‌ పిలుపునిచ్చినట్లు ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్‌లను దక్షిణ సరిహద్దుల్లో మోహరించినట్లు ప్రకటించింది. మిత్రదేశాలైన రష్యా, చైనాల మద్దతుతో ఉత్తర కొరియా అనేకసార్లు ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఉల్లంఘించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు