ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కే ఉగ్రవాదులు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్థాన్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. కరాచీలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఘటనను మరువక ముందే... వారు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం సాయంత్రం బెలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టా నుంచి కరాచీకి రెండు బస్సుల్లో బయలుదేరిన 25 మంది ప్రయాణికులపై వీరు దాడి చేశారు.
సెక్యూరిటీ గార్డు దుస్తులు ధరించిన ఉగ్రవాదులు వీరు ప్రయాణిస్తున్న బస్సులను అపహరించుకుపోయారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని వెంబడించాయి. ఈ క్రమంలో కొండ ప్రాంతంలోకి బస్సును తీసుకెళ్లిన ఉగ్రవాదులు... ప్రయాణికులపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. మిగిలిన ప్రయాణికుల్లో ఒకరు గాయపడగా, ఐదుమంది సురక్షితంగా బయటపడ్డారు.