రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 6 అక్టోబరు 2024 (19:50 IST)
కెనడాలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు వందల సంఖ్యలో క్యూకట్టడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కెనడాలో భారతీయ విద్యార్థుల దీనావస్థను తెలియజేసే ఈ వీడియోను మేగ్ అప్ డేట్స్ అనే యూజర్ ట్వీట్ చేశారు. కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్ వెయిటర్లు, సర్వర్లు కావాలంటూ స్థానిక మీడియాలో ప్రకటన ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రకటనకు రెస్పాన్స్ అసాధారణంగా ఉందని, ఏకంగా 3 వేల మంది రెస్టారెంట్ ముందు బారులు తీరారని చెప్పుకొచ్చారు.
 
ఇందులో చాలావరకు భారత విద్యార్థులే ఉన్నారని పేర్కొన్నారు. కెనడాలో నిరుద్యోగాన్ని, భారత విద్యార్థుల అవస్థలను ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కెనడాలోని యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం వచ్చే భారతీయ విద్యార్థులు పునరాలోచించుకోవాలని ఈ ట్విట్టర్ యూజర్ హెచ్చరించారు. 
 
కాగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే, మరికొంతమంది మాత్రం ఆ విద్యార్థులకు మద్దతు తెలిపారు. విదేశాల్లో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేయడం సాధారణ విషయమని కామెంట్లు పెడుతున్నారు. 
 
తమ చదువుకు, తిండికి అయ్యే ఖర్చును విద్యార్థులు ఇలా సంపాదించుకుంటారని వివరించారు. రెస్టారెంట్ ముందు లైన్ లో నిలుచున్న విద్యార్థులలో కొంతమంది గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం నిజమే కావొచ్చు అయినప్పటికీ వారు భవిష్యత్తులో మెరుగైన జీవితం గడుపుతారని, చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఇలా క్యూలో నిలుచోవడం వారి కష్టపడే మనస్థత్వాన్ని తెలియజేస్తోందని మరికొందరు కామెంట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు