అఫ్గాన్ నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకున్న వేళ.. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తమ బలగాలు, మిత్ర దేశాల పౌరుల తరలింపు ప్రక్రియలో భాగంగా ఈ గడువు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.
ఇలాంటి వార్తలపై స్పందించిన తాలిబన్లు.. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గాన్‌లోనే ఉంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 31 వారికి 'రెడ్ లైన్' అని స్పష్టం చేశారు. ఇలా ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ, మరోవైపు తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు 31న అఫ్గాన్‌లో ఏం జరగబోతోందనే విషయంపై యావత్ ప్రపంచం ఆందోళనతో ఉత్కంఠగా చూస్తోంది.
తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వివిధ దేశాల పౌరులు, రాయబార కార్యాలయాల సిబ్బందిని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ముమ్మరమైంది. ఇందులో భాగంగా అమెరికా కూడా వారి పౌరులతో పాటు మిత్ర దేశాల సిబ్బందిని తరలిస్తోంది.