జవహరీ అంతంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:45 IST)
అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా సైన్యం (సీఐఏ) హతమార్చడంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పందించారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరుగకుండా జవహరీని అంతం చేయడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. 
 
9/11 సూత్రధారికి ఎట్టకేలకు దాదాపు 20 ఏళ్ల తర్వాత శిక్ష పడిందని అన్నారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యమే అనడానికి ఈ ఆపరేషన్‌ నిదర్శనమన్నారు. ఈ ఆపరేషన్ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీఐఏ అధికారులను కొనియాడారు. 
 
ఇదే అంశంపై ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు. 'అమెరికాలో 9/11 ఉగ్రదాడి జరిగిన 20 ఏళ్ల తర్వాత దాడికి ప్రధాన సూత్రధారుల్లో ఒకడు అల్‌ జవహరీకి ఎట్టకేలకు శిక్ష పడింది. ఈ క్షణం కోసం అమెరికా నిఘా సంస్థ సభ్యులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఒక్క ప్రాణ నష్టం లేకుండా జవహరీని కౌంటర్‌ టెరరిజం నిపుణులు మట్టుబెట్టగలిగారు. 
 
ఈ సందర్భంగా బైడెన్‌ నాయకత్వానికి, ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి యుద్ధం చేయకుండానే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యమే అని చెప్పేందుకు ఈ ఆపరేషనే నిదర్శనం. అల్‌ఖైదా కారణంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నవారికి, 9/11 మృతుల కుటుంబాలకు ఈ వార్త ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నా' అని ఒబామా పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు