ఏం నేను.. ఆడదానిలా కన్పించడంలేదా..!?: నటి శ్యామలా దేవి
గురువారం, 16 ఫిబ్రవరి 2012 (12:05 IST)
WD
ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న 'జోగిని' ఆచారంపై పోరాటాలు చేస్తూ ఈ దురాచారాన్ని రూపుమాపడానికి మా వంతు చేస్తున్న ప్రయత్నమే ఈ 'వీరంగం' చిత్రమంటున్నారు.. నిజ జీవితంలో జోగిని పాత్ర పోషించిన శ్యామలా దేవి.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో.... ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రంలో నటించినందుకు విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారని తన ఆనందాన్ని పంచుకున్నారు నటి శ్యామలాదేవి.
సుమన్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రలు పోచించిన ఈ చిత్రాన్ని శివాని ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి.యల్. శ్రీనివాస యాదవ్ నిర్మించారు. వేముగంటి దర్శకుడు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్యూ.....
ప్రశ్న: మీరు నటించిన మొదటి చిత్రమే అందరి నుండి ప్రశంసలు అందుకోవడం ఎలా ఉంది? జ: ఈ క్రెడిట్ మొత్తం మా దర్శకుడు వేముగంటి గారికి, నిర్మాత శ్రీనివాస యాదవ్ గారికే చెందుతుంది. వేముగంటి గారు ఎలా చెబితే అలా నటించాను. అయితే జోగినిలు ఈ వ్యవస్థలో ఎంతటి దురాచారాలకు గురవుతున్నారో నా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడం చాలా సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించిన మనం వందల ఏళ్ళ క్రితం కాకతీయుల కాలంలో ఏర్పడ్డ దేవదాసి-జోగిని అనే ఈ దురాచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇక నేను పోషించిన పాత్రకు ఇంటా బయటా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రశ్న: మీ ప్రస్థానం గురించి చెబుతారా? జ: నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నా ఏడేళ్ళ ప్రాయం నుండి బోనాలు ఎత్తుకుని ఆడేదాన్ని. అప్పటి నుండీ నా ఈ ప్రస్థానం మొదలైంది. ఇక నేను పెద్దగా చదువుకోలేదు కానీ, జీవితాన్ని చదివాను.
ప్రశ్న: మీరు ఆడా? మగా? అనే అనుమానం చాలామందిలో ఉంది? జ: ఏం నేను.. ఆడదానిలా కన్పించడంలేదా.. ఎవరెవరో ఏదో అనుకుంటున్నారు. అవన్నీ పుకార్లు మాత్రమే.
ప్రశ్న: జోగిని వ్యవస్థ గురించి వివరిస్తారా? జ: కాకతీయుల కాలంలో ఈ జోగిని మరియు దేవదాసి వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా వీరు దేవాలయాన్ని శుభ్రపరిచి తర్వాత దేవుణ్ని అలంకరించి సేవ చేయడానికి ఆనాడు కాకతీయరాజులు నియమించారు. అలాగే కేవలం రాజులు మాత్రమే దేవదాసి లను అనుభవించేవారు. కాలక్రమేపీ ఆ గ్రామ పెత్తందార్లు దేవదాసిలను, జోగిని లుగా పిలవబడే ఈ అమాయక పేదవారిని బలవంతంగా తమ లైంగిక అవసరాలను తీర్చుకునేవారు. వీరిని జన జీవన స్రవంతిలోకి తీసుకెళ్తే వారి అవసరాలు తీర్చుకోవడానికి వీలుండదని ఈ ఆచారాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు. పేదవారిని వారు టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా తల్లి దండ్రులు లేని వారిని చూసి దింపుతారు. ఇప్పటికీ ఆరు రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ దురాచారం కొనసాగుతోంది.
ప్రశ్న: జోగినికి, దేవదాసికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? జ : దేవదాసిలు కొంచెం ఉన్నత కుటుంబాలకు చెందిన వారు. అంటే కేవలం రాజులు మాత్రమే వివిధ రకాలుగా ఉపయోగించుకునేవారు. జోగినిలు అంటే పూర్తిగా పేదవారు. వీరిని అందరూ ఉపయోగించుకోవాలని చూస్తారు.
ప్రశ్న: నిజ జీవితంలో జోగినిగా ఉన్న మీరు కూడా ఇలాంటి ఆకృత్యాలకు బలయ్యారా? జ: నిజం చెప్పాలంటే నేను ఏనాడూ సెక్సువల్ ఎరాస్‌మెంట్‌కి గురి కాలేదు. దానికి కారణం లేకపోలేదు. మన రాష్ట్రంలో ఎక్కడ జాతర జరిగినా నేను వెళ్ళి బోనాలు ఎత్తుకుని ఆడేదాన్నే తప్ప ప్రత్యేకించి ఒకే ఊర్లో చేసింది లేదు. మన రాష్ట్రంలోని కొమరవెల్లి, సమ్మక్క సారక్క, ఏడు పాయలు, వేములవాడ తదితర జాతర ఓ ప్రత్యేకంగా వెళ్ళేదాన్ని. కానీ జోగినిలు ఎంత మానసిక క్షోభకు గురవతున్నారో దగ్గరినుండి చూసాను.
ప్రశ్న: ఇందులో మీ పాత్ర తీరు తెన్నులు? జ: నేను నిజ జీవితంలో పోషించిన పాత్రే ఇందులో కూడా పోషంచాను. ఐతే కథలో భాగంగా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో కూడా నటించడం జరిగింది. అయితే ఇప్పుడు లక్షల మంది భక్తులు నేను అలా నటించడం పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప చిత్రంలో నటించినందుకు గర్వ పడుతున్నాను.
ప్రశ్న: దర్శకుడు వేముగంటి గురించి చెప్పండి? జ : సింపుల్‌గా చెప్పాలంటే స్త్రీల సమస్యలపై పోరాడే సినిమాలు తీసే సౌత్ ఇండియన్ శ్యామ్ బెనగల్ అని చెప్పొచ్చు. గతంలో ఆయన తీసిన 'గంగ' చిత్రం కూడా ఇలాంటి కోవకు చెందిందే. ఈ సినిమా నేను చేయనని పట్టు పట్టినా దాదాపు రెండు నెలలు ప్రతి రోజూ ఫోన్ చేసి ఆయన కూడా పట్టుబట్టి చివరికి ఒప్పించాడు. ఇప్పుడు వస్తున్న ఈ పేరు ప్రఖ్యాతలు మొత్తం వేముగంటి గారికే చెందుతుంది.
ప్రశ్న: నిర్మాత సి.యల్. శ్రీనివాస యాదవ్ గురించి? జ: ముఖ్యంగా నిర్మాత శ్రనివాస యాదవ్ గారి గురించి చెప్పుకోవాలి. నాకు నటిగా జన్మనిచ్చిన ఆయన స్థాపించిన శివానీ ఆర్ట్స్‌కి జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను నమ్మి ఒక సినిమాని తీశాడు. ఇప్పుడు ఈ చిత్రం విజయవంతం అవడం చాలా సంతోషంగా ఉంది. ప్రశ్న: మీ సహ నటుడు సుమన్ గారి గురించి? జ: సుమన్ గారి గురించి చెప్పాలంటే.. చిన్నప్పటి నుండీ ఆయన సినిమాలు చూసి పెరిగిన నేను మొదటి రోజే అదీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం నా వల్ల కాలేదు. అయితే ఒక స్టార్ హీరోల కాకుండా మంచి సలహాలిచ్చారు. కానీ నేను కొన్ని సన్నివేశాల్లో చేయలేక ఎందుకు ఒప్పుకున్నానా దేవుడా అని ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. కానీ సుమన్ గారు, వేముగంటి గారు నా నిరుత్సాహాన్ని పోగొట్టారు. ఇప్పుడు సినిమా విడుదలయ్యాక నన్ను నేను చూసుకుంటే నాకే కొత్తగా అనిపిస్తోంది.
ప్రశ్న: మొత్తం మీద మీ సినిమా అనుభూతి ఎలా ఉంది? జ: చాలా కంఫర్టబుల్‌గా ఉంది. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న మంచి టీమ్‌లో పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులుండవని తెలిసింది. చాలామంది మహిళలు మంచి పాత్ర పోషించామని అభినందిస్తున్నారు. ఇది అందరూ చూడతగ్గ సినిమా.
ప్రశ్న: మీ నిజ జీవితంలో జోగిని వ్యవస్థపై మీరు చేస్తున్న పోరాటం గురించి? జ: 'సహాయ జోగిని వెల్పేర్ సొసైటి' అనే యన్.జి.వో సంస్థను రన్ చేస్తున్నాను. ఈ సంస్థ ద్వారా జోగినిలు గా ఉండి కష్టాలు అనుభవిస్తున్న వారి పిల్లల చదువు, అలాగే వారి స్థోమతకు తగ్గ చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నాను. ప్రభుత్వం నుండి కూడా ఏమైనా సహాయ సహకారాలు అందేలా చూస్తున్నాము.
ప్రశ్న: ఇకపై కూడా సినిమాల్లో నటిస్తారా? జ : ప్రస్థుతం సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలు చేసేది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదు. త్వరలోనే ఏ విషయం వెళ్ళడిస్తానంటూ ముగించింది జోగిని శ్యామలాదేవి.