నా దృష్టిలో ఒక రజనీకాంత్.. ఒక పవన్‌కళ్యాన్: బండ్ల గణేష్
మంగళవారం, 29 మే 2012 (18:01 IST)
WD
ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, బయట ఎక్కడ నలుగురు మాట్లాడుకున్నా పవన్‌కళ్యాన్ నటించిన 'గబ్బర్‌సింగ్' గురించే చర్చ నడుస్తుంది. ఇద్దరు దర్శకులు కలుసుకున్నా, నిర్మాతలు కలుసుకున్నా... ఇదే టాక్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సరేసరే... ఇప్పటికీ కొన్నిచోట్ల బ్లాక్‌లో టిక్కెట్లు కొంటున్నారని చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అంటున్నారు. ఈ చిత్రం ఇంత విజయం సాధిస్తుందని ఊహించలేదని.. అంటున్న ఆయన పవన్‌కళ్యాణ్‌తో పనిచేసిన అనుభవాలు, సినిమా సంగతులు ఈ విధంగా వెబ్‌దునియాకు ప్రత్యేకంగా తెలియజేశారు..
నిర్మాతగా విజయం తర్వాత ఎలా అనిపించింది? ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో 'తీన్మార్' చేశాను. అది నాకు చాలా నచ్చిన చిత్రం. టెక్నికల్‌గా కొన్ని లోపాలున్నాయేమో తెలియదు కానీ.. ఆ సినిమాకు పడినంత కష్టం పవన్‌కళ్యాణ్ ఏ సినిమాకూ పడలేదు. చలిలో కూడా ముసుగు వేసుకుని అర్థరాత్రులు షూటింగ్ చేశారు. జయాపజయాలు దైవానదీనం. ఆ సినిమా సూపర్‌హిట్ అవుతుందనుకున్నా. కానీ.. నిరాశపర్చింది. సినిమా రిలీజ్ తర్వాత సినిమా పోయింది సార్ అని చెప్పాను. వెంటనే మరోమాట మాట్లాడకుండా... తర్వాత సినిమా నువ్వే చేయ్ అన్నారు.
గబ్బర్ సింగ్ పవన్గారే స్వంతంగా చేయాలనుకున్నారు గదా? అవును. ఆయనే చేయాలనుకున్నారు. కానీ గతంలో ఇచ్చిన మాట ప్రకారం...నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూదని గబ్బర్‌సింగ్ సినిమా నన్ను చేయమన్నారు.
'దబంగ్' హిట్..దాన్ని తెలుగులో చేయడం సాహసం అనిపించలేదా? కరేక్టే.. చాలామంది అన్నారు. ఈ సినిమా రైట్స్ కోసం పలువురు నిర్మాతలు కూడా తీసుకుందామా? వద్దా? అనే డైలమాలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేసి.. వెంటనే ఆ సినిమా రైట్స్ తీసుకో అన్నారు. తీసుకున్నానని చెప్పాక.. కాగితాలు చూపించు అన్నారు. ఎందుకంటే.. ఎక్కడా కాంట్రవర్సీ రాకూడదని.. కాగితాలు చూపించాక... వెంటనే 'గబ్బర్‌సింగ్' టైటిల్ రిజిష్టర్ చేయమన్నారు.
ఇది నెగెటివ్ టైటిల్ కదా. మీకు ఎలా అనిపించింది? అవును. మొదట్లో నేను కంగారుపడ్డాను... అలా అనేకంటే.. భయపడ్డాననడం కరెక్ట్. నిర్మాతగా నాకూ హిట్ లేదు. హీరోగా పవన్‌కళ్యాణ్‌కూ హిట్లు లేవు. సంగీత దర్శకునిగా దేవీశ్రీప్రసాద్‌ను చాలామంది మర్చిపోయారు. హీరోయిన్గా శ్రుతిహాసన్ ఐరన్‌లెగ్ పొజిషన్లో ఉంది. ఇన్ని మైనస్లున్న సినిమాకు నేను నిర్మాతగా చేయడం... నాకే భయంగానూ... ఆందోళనగానూ ఉంది. కానీ.. పవన్‌కళ్యాణ్‌పై నమ్మకంతో ఈ సినిమా చూశాను. ఆయన సినిమా ఇవ్వబట్టే... నేను నిర్మాతగా పేరు తెచ్చుకున్నా..
WD
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా చాలా దగ్గరుండి పరిశీలించారు కదా... ఆయన్ను అంతా కాస్త తిక్కుంది అంటూ సినిమాలోని డైలాగ్‌లా భావిస్తారెందుకు? ఆయనంటే గిట్టనివాళ్లు బహుశా ఆయన్ను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారనుకుంటాను. ఆయన్ను చాలా దగ్గరగా పరిశీలించినవాడిని.. ఆయన నా దృష్టిలో రజనీకాంత్ లాంటివాడు. తమిళనాడు ఒక రజనీకాంత్. తెలుగులో ఒక పవన్‌కళ్యాణ్. ఆయనతో మాట్లాడితే.. మళ్ళీ ఆయనకూ దూరం కాలేవు. కాకపోతే ఆయనెక్కువగా మాట్లాడడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక... అంతే.. నలుగురితో చర్చలేమీ ఉండవు. ఆయన్ను దూరం నుంచి చూసినవారు రకరకాలుగా అనుకుంటున్నారు.
'రచ్చ' ఆడియో తర్వాత చిరు కుటుంబంతో తేడాలున్నాయనే విమర్శలు వచ్చాయి. కానీ గబ్బర్‌సింగ్ ఆడియోలో అంతా కలిసిపోయారు. ఈ క్రెడిట్ మీకు దక్కుతుందా? అలాంటిది ఏమీలేదు. పవనకళ్యాణ్‌కు చిరంజీవి అంటేప్రాణం. రామ్‌చరణ్ అంటే మరింత. చిన్నప్పటి నుంచి బాగా పెంచినవాడు. చిరు కుటుంబంలో కలతలు లేవు. ఇదంతా మీడియా సృష్టే. 'రచ్చ' సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్లు ఎలా ఉన్నాయి.. అంటూ పదేపదే తెలుసుకుంటూ ఉండేవారు. అలాగే చిరంజీవి కూడా గబ్బర్‌సింగ్ విడుదల తర్వాత నాకు ఫోన్ చేసి... మంచి సినిమా తీశావ్. తమ్ముడికి సూపర్ హిట్ ఇచ్చావన్నారు. తమ్ముడు ఎక్కడున్నాడని అడిగాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్నారు. ఒకవైపు ఎలక్షన్లు, మరోవైపు రామ్‌చరణ్ పెండ్లి ప్రయత్నాల్లో కూడా పవన్ గురించి వాకబు చేయడం.. ఇదంతా... కుటుంబంలో కలహాలు లేవనే తెలుస్తుంది గదా.
గబ్బర్‌సింగ్ టైటిల్ విషయంలో వివాదం జరిగిందని తెలిసింది? అవును. మేం గబ్బర్‌సింగ్ టైటిల్ రిజిష్టర్ చేసి మీడియాకు ఇచ్చాక....'షోలే' నిర్మాతలకి తెలిసింది. 30 ఏళ్ళ తర్వాత కూడా బాలీవుడ్లో కూడా పెట్టని, పెట్టాలని ఆలోచన రానిది తెలుగు సినిమాకు రావడం విశేషమని మెచ్చుకుంటూనే.... మమ్మల్ని అడిగారు. వెంటనే మేం వారిని కలిసాం. చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుని టైటిల్‌ను ఇచ్చారు.
గబ్బర్‌సింగ్‌లో సన్నివేశాలు కావాలని హిందీలో అడిగారని తెలిసింది? అవును. కొన్ని సన్నివేశాలు తాము తీసుకుంటామని వారు చెప్పారు. దబాంగ్-2లో వాటిని వినియోగిస్తామన్నారు. ఈ సినిమాను ముంబైలో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా షో ఏర్పాటు చేస్తున్నాం.
WD
ఇంతకీ.. ఈ సక్సెస్ పట్ల పవన్‌కళ్యాణ్ ఎలా స్పందించారు? ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. పెద్దగా స్పందించరు.. ఈ సినిమా టాక్ విని ఎలా ఉందని ఆయన్ను అడిగాను.. 'బాగుంది' అని సింపుల్‌గా చెప్పారు. అదేంటన్నా.. అంతా సూపర్‌హిట్ అంటుంటే...అని నేనే అడిగా. 'నాకు బ్రహ్మాండంగా నచ్చింది..' అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. ఈ ప్రశంసలు అంటే ఆయనకు పడదు. నేనే ఒకసారి ఇంటికెళ్ళి సూపర్‌డూపర్ హిట్ అయింది.
బాలీవుడ్లో కూడా సీన్స్ అడుగుతున్నారని చెబుదామని వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే... బయట లుంగీతో మామిడిచెట్టుకు నీళ్లుపడుతున్న వ్యక్తిని చూసి అయ్యగారు లేరా అని అడిగాడు. వెంటనే.. కిసుక్కున నవ్వేస్తూ... ఆ అయ్యాగారిని నేను చెప్పు అంటూ ఒక్కసారి నావైపు తిరిగారు. నేను ఆశ్చర్యపోయా.. ఇంత సక్సెస్ వచ్చినా.. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనంటే ఆయనే... ఆయనలా మరొకరు ఉండరు. దేవుడు ఆయన్ను అలా తయారుచేశారు.
ఫైనల్‌గా.. ఒక ప్రశ్న... బొత్సకు మీరు బినామి అనే దానికి మీ కామెంట్? అదంతా అబద్ధం. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నటుడు నుంచి నిర్మాతగా ఎదిగాను. సక్సెస్ వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న పరిచయం అయింది. ఆయనతో నాకున్న స్నేహాన్ని చూసి బినామీ అనడం న్యాయం కాదు. నాకు నేనుగా ఈ స్థాయికి ఎదిగాను... అంటూ ముగించారు.