నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవారే..!: పూరీ
WD
"జీవితాన్ని జీవితంగా చూడాలి. సినిమా భాషలో చెప్పాలంటే.. జామ్‌చేసి చూడకూడదు. వైడ్‌లోనే చూడాలి. అప్పుడే అందంగా ఉంటుంది.." అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గత మూడేళ్ళుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం గోలిమార్ చిత్రం విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్నానంటున్నారు.
ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: గోలిమార్ ఎంతరేంజ్‌లో హిట్ అయిందనుకుంటున్నారు? జ: రేంజ్ ఇంత అనేది చెప్పలేను. కానీ నాకు మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉంది. నైజాం, సీడెడ్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రలో ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రశ్న: కానీ పోకిరి చిత్రాన్నే రివర్స్‌లో తీశారనే విమర్శలున్నాయి? జ: పోలీసు చిత్రమంటేనే పోకిరి అని ప్రేక్షకులు అలా ఫిక్స్ అయిపోయారు. దానికి మనం ఏం చేయగలం. పోకిరి తర్వాత దేశముదురు, బుజ్జిగాడు ఇలా కొన్ని తీశాను. అయినా అదే లుక్‌లో చూస్తున్నారంటే..? ఏమీ చెప్పలేం కదా..!
ప్రశ్న: మీ కొచ్చిన ప్రశంసలు సరే.. విమర్శలు ఏమైనా వచ్చాయా? జ: కరెక్ట్.. సినిమా చూసి చాలామంది మెయిల్స్, ఎస్ఎమ్ఎస్‌లు పంపారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది మాఫియా బ్యాక్‌డ్రాప్ వద్దు. ఇక మీరు లవ్‌స్టోరీలు తీయండని చెప్పారు.
ప్రశ్న: మరి రాంగోపాల్‌వర్మతో సినిమా తీస్తున్నారని తెలిసింది..? జ: రాంగోపాల్‌వర్మ అంటేనే మాఫియా చిత్రాల నిర్మాత అని టాక్ వుంది. వర్మను నిన్నే కలిశాను. ఆయన చాలా డైనమిక్‌పర్సన్. తను చెప్పాల్సింది చెప్పేదాకా వదలడు. కథ గురించి చర్చించాం. మాఫియా ఛాయలున్నా.. లవ్‌ట్రాక్ అనేదే ఇందులో ప్రధానం. పోకిరి ఎంటర్‌టైన్‌మైంట్, సిరీస్ అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.
ప్రశ్న: పోలీసులను కీర్తిస్తూ గోలిమార్‌లో పాటుంది. దానికి స్పందన ఎలా ఉంది? జ: ఇంతవరకూ లేదు. ముందుముందు ఉంటుందో చూడాలి. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. నెగెటివ్ అయితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. "పోకిరి"లో ఆశిష్ విద్యార్థి వాడిన జీప్‌మీద "మాదాపూర్" అని ఉంటుంది. అది చూసి అప్పటి మాదాపూర్ సీఐ చర్చ పెట్టాడు. ఆశిష్ విద్యార్థి కరెప్ట్‌డెడ్. అలాంటి వాడికి నా ఏరియా పేరు పెట్టారంటూ.. వెంటనే తీసేయండని గోలచేశాడు. అప్పటికే సినిమా రన్నంగ్‌లో ఉంది. చేసేది లేక ఆ బోర్డు వరకు కాస్త చెరిగిపోయేట్లుగా మార్చాం. దానికి చాలా కష్టపడాల్సివచ్చింది. కట్‌చేస్తే.. కొద్దిరోజుల తర్వాత అవినీతి ఆరోపణలను ఆ సీఐ ఎదుర్కొన్నాడు. అంటే..? ఆయన తప్పుచేశాడు కాబట్టే ఎక్కడో టచ్ అయ్యిందన్నమాట..!
ప్రశ్న: గోలిమార్‌లో సంగనాకిపోతావ్? తొక్కలోది అనే పదాలు పిల్లల్ని, యూత్‌ను చెడగొట్టేవిగా ఉన్నాయి? జ: యూత్‌ను మనం మార్చనక్కరలేదు. వారు మాట్లాడుకునే మాటలు కావాలంటే నేను మీకు విన్పిస్తాను. సినిమాలో చూపించినదానికన్నా ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయినా సెన్సార్‌వారే అభ్యంతరం చెప్పలేదు. అరుంధతిలో బొమ్మాలీ నే వదల అంటూ ఇప్పటికీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని నెగెటివ్‌గా ఎందుకు అనుకోవాలి.
ప్రశ్న: బాలీవుడ్‌కు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి? జ: నిజమే. బాలీవుడ్‌లో కూడా సినిమా చేయాల్సి వుంది. త్వరలోనే అది ప్రారంభం కావచ్చు.
ప్రశ్న: "సింహా" హీరో బాలకృష్ణ చిత్రం ఎప్పటినుంచి తీస్తున్నారు? జ: కొంత టైమ్ పడుతుంది. బాలకృష్ణకు రెండు కథలు చెప్పాను. అవి నచ్చలేదు. కొద్దిరోజుల్లో ఆ వివరాలు చెబుతాను.
ప్రశ్న: ఒకేసారి పది సినిమాలని ఆ మధ్యలో ప్రకటించారు. ఎంతవరకు వచ్చింది? జ: నిజమే. అప్పట్లో సందడే సందడి నిర్మాత ఆదిత్యరామ్‌తో కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా అది సాధ్యం కావడం లేదు. నేనే కథలు, సంభాషణలు, దర్శకత్వం వంటి బాధ్యతలు చేపట్టాలి. అందుకే అవన్నీ కుదరవని వదిలేశాం.
ప్రశ్న: ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారనే టాక్ ఉంది. ఏమైనా కోలుకున్నారా? జ: ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా. నా స్థానంలో వేరే ఒకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే. ఎన్నివిధాలా మైండ్‌ను కంట్రోల్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. చాలామటుకు సమస్యలు తీరిపోయాయి. ఇప్పడు చాలా హ్యాపీ.
ప్రశ్న: జీవితాన్ని ఎలా విశ్లేషిస్తారు? జ: జీవితాన్ని జీవితంగా చూడాలి. బూతద్ధంతో చూడకూడదు. ఎక్కడో మచ్చలు కనబడతాయి. వైడ్‌లో చూడాలి. అదే జీవితం.