రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు జట్టు బలం.. బలహీనతలు...

గురువారం, 17 సెప్టెంబరు 2020 (11:50 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వీటిలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఒకటి. ఈ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ టోర్నీ కోసం ఇప్పటికే యూఏఈ గడ్డపై అడుగుపెట్టిన ఆర్సీబీ.. ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే, ఈ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షలా మారింది. 
 
జట్టులో అదరగొట్టే ఆటగాళ్లు ఉన్నప్పటికీ నిలకడలేని ఆటతీరుకారణంగా టైటిల్ రేసులో వెనుకబడిపోతోంది. కానీ, ఈ సారి మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టాలన్న తపన ఆ జట్టులో కనిపిస్తోంది. ఇందులోభాగంగానే, ఐపీఎల్ వేలం పాటల్లో ఆ జట్టు యాజమాన్యం చాలా తెలివిగా నడుచుకుంది. డివిల్లీర్స్‌, మొయిన్‌ అలీ వంటి విదేశీ క్రికెటర్లను రిటైన్‌ చేసుకుంది. ఫించ్‌ను ఎంచుకుంది. నిరుడు అట్టడుగున నిలిచిన ఆర్‌సీబీ ఈసారి అగ్రస్థానమే ధ్యేయంగా తీవ్రంగా శ్రమిస్తోంది.
 
అయితే, ఈ జట్టు బలం.. బలహీనతలను పరిశీలిస్తే, ఈ జట్టులో మొత్తం 8 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్లు, ఆరుగురు కుడిచేతి వాటం క్రికెటర్లు ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌ అంతా అటు పేస్‌ ఇటు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సాటిలేని వారే. ఇద్దరేసి లెఫ్టామ్‌ స్పిన్నర్లు, ఆఫ్‌ స్పిన్నర్లు, లెగ్‌స్పిన్నర్లుండటం ఆర్సీబీకి కలిసివచ్చే అంశం.
 
పేస్‌ బౌలింగ్‌ సీనియర్లు, జూనియర్ల సమ్మేళనం. నవదీప్‌ షైనీ నిప్పులు చెరిగే బంతులకు, ఉమేశ్‌ యాదవ్‌ డెత్’ బౌలింగ్‌ తోడుగా నిలవడంతోపాటు స్టెయిన్‌, మోరిస్‌ పదునైన బౌలింగ్‌తో టాప్‌, టెయిలెండర్లకు దడపుట్టిస్తే బెంగళూరుకు తిరుగుండబోదు. తనకు కలిసొచ్చే యూఏఈ పిచ్‌లపై బౌలర్ ఉదాన విజృంభిస్తే ఆర్‌సీబీకి టైటిల్‌ ఆశలు నెరవేరడం ఖాయం. 
 
అలాగే, బలహీనతను బేరీజువేస్తే... ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌పై అతిగా ఆధారపడడం ఆర్సీబీ కొంప ముంచుతోంది. వారు విఫలమైతే మిగిలిన బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌‌లో నిలదొక్కుకోలక పోవడం. అలాగే డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ సమస్య కూడా జట్టును వేధిస్తోంది. స్టెయిన్‌, మోరిస్‌, ఉదాన మేటి బౌలర్లు అయినా నిఖార్సయిన డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు కారు. డెత్ ఓవర్లలో క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆడేవారు లేకపోవడం ఆ జట్టుకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు