IPL 2021 Suspended: కరోనాతో క్రికెటర్లకు కష్టాలు.. ఇక ఆపేద్దాం.. బీసీసీఐ

మంగళవారం, 4 మే 2021 (14:53 IST)
IPL 2021
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‍కు బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి ఐపీఎల్ 2021ను కూడా కదిలించింది. ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ను ఆపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక జరిగేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
ఫలితంగా ఐపీఎల్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను కరోనా తీవ్రత దృష్ట్యా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నాలుగు వేర్వేరు ఐపిఎల్ జట్ల నుంచి చాలామంది ఆటగాళ్ళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా.. కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 
 
ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అమిత్ మిశ్రాకు కరోనా సోకగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వృద్ధిమాన్ సాహాకు పాజిటివ్ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఇద్దరికి ఇప్పటికే కరోనా సోకింది.
 
ఈ క్రమంలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జూలై లేదా ఆగస్టులో, కరోనా పరిస్థితులను బట్టి, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బిసిసిఐ ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. అంతకుముందు, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీకి కరోనా పాజిటివ్ రాగా.. చెన్నై, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా వాయిదా పడింది.
 
సమ్మర్‌లో సందడి చేస్తున్న ఐపీఎల్ కూడా కరోనా దెబ్బకు ఆగిపోయాయి. ఐపీఎల్‌లోని మొత్తం 60 మ్యాచ్‌లలో 29 మ్యాచ్‌లు ఇప్పటివరకు ముగియగా.. కరోనా వైరస్‌ కారణంగా విపత్కర పరిస్థితులు మధ్య ఆట ఆగిపోయింది. గత ఏడాది యూఏఈలో ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై జట్టులో పలువురు కరోనా బారిన పడగా, తర్వాత అంతా చక్కబడి మ్యాచ్‌లు సాఫీగా జరిగాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అదుపులోకి రావట్లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు