శుభాలను సమృద్ధిగా అందించే రంజాన్!

సోమవారం, 14 జులై 2014 (16:12 IST)
పవిత్ర రంజాన్ అత్యంత శుభప్రదమైన మాసం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ పవిత్ర మాసంలో చిత్తశుద్ధితో రోజా (ఉపవాసం) వ్రతం పాటించే వారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. రోజేదారులు (ఉపవాసం పాటించేవారు) 'రయ్యాన్' అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారు. 
 
ఈ విధంగా ఇంకా అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దైవం ఈ మాసాన్ని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్డాడు. మానవుల ఇహ,పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే మాసం ఈ పవిత్ర రమజాన్. కనుక ప్రతి ముస్లిం ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి శవంచన లేని కృషి చేస్తుంటారు. విశ్వాసులారా! పూర్వ ప్రవక్తల అనుయాయులపై ఏ విధంగా రోజాలు (ఉపవాసాలు) విధిగా నిర్ణయించబడ్డాయో , అదే విధంగా ఇప్పుడు మీపై కూడా ఉపవాసాలను విధిగా నిర్ణయించాం. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని ఖురాన్‌లో పేర్కొన్నారు. 
 
ఒక మనిషి దైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త, సంప్రదాయ విధానం ప్రకారం ఉపవాసం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో ఈ సుగుణాలు జనించి తీరవలసిందే. మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా ఉపవాసాలు ఆచరించే వారిని సత్కార్యాల ప్రతిరూపం అనవచ్చు. ఇలా పాటించే వారి అంతరంగంతోపాటు బాహ్యంలో కూడా పవిత్రాత్మ నిత్యం దోషాలకు అతీతంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 
 
రంజాన్ ఉపవాసాలు మానవులకు ఇహ, పరాల్లో అనంతమైన మేలును, శుభాన్ని కలుగుజేస్తాయి. కనుక చిత్తశుద్ధితో నియమబద్ధంగా ఈ మాసాంతం ఉపవాసాలు పాటిస్తూ, రోజూ ఐదుల నమాజులతో పాటు తరావీలు, దానధర్మాలు, ఖురాన్ గ్రంథ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. మానవాళి పాలిట శుభాల పంటగా వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. దైవం సమస్త జనులకూ, జగత్తుకూ రంజాన్ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 

వెబ్దునియా పై చదవండి