షియోమీ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ఇండియా హెడ్ మను జైన్ వెల్లడించారు. బెంగళూరులోని ఓ షోరూమ్‌లో షియోమీకి చెందిన రెడ్ మీ నోట్ 4 పేలినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో ఫేక్ అంటూ మను జైన్ వెల్లడించారు. పేలింది రెడ్‌మీ నోట్ 4 కాదని స్పష్టం చేశారు.
మొబైల్‌లో సిమ్‌కార్డు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయినట్టు వీడియో ఫుటేజీ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది రెడ్‌మీ నోట్ 4 ఫోనేనంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన మను.. షియోమీ పేలిందనే దానిపై విచారణ చేపట్టామని.. పేలిన ఫోన్ నోట్ 4 కాదని.. ఇంకా అది తమ కంపెనీకి చెందిన ఏ బ్రాండూ కాదన్నారు.
పూర్వికా మొబైల్ స్టోరులో పేలిన ఫోను తమది కాదని.. యూట్యూబ్ క్రియేటర్స్ కావాలనే తమ బ్రాండుపై మచ్చ తెచ్చేందుకు ఈ పని చేశారని మను చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. వేరేదో కంపెనీకి చెందిన ఫోన్ పేలితే రెడ్ మీ నోట్ ఫోర్ పేలినట్లు కథలు అల్లారన్నారు. వీడియో మొత్తం ఫేక్ అని తెలిపారు. గత ఏడాది శామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 7 ఫోన్లు పేలడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.