రూ.1కే వన్ ప్లస్ 3 మోడల్ స్మార్ట్ ఫోన్.. దీపావళి ఫ్లాష్ సేల్.. అక్టోబర్ 24 నుంచి 26 వరకు..?

బుధవారం, 19 అక్టోబరు 2016 (11:55 IST)
ఇంటర్నెట్ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకం శరవేగంలో జరుగుతున్నాయ్. ప్రస్తుతం చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇందుకు వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనా కంపెనీలు చేస్తున్న జిమ్మిక్కులే కారణం. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కూడా ఒక్క రూపాయికే వన్‌ ప్లస్ 3 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని తాజాగా ప్రకటించింది.
 
దీపావళి సందర్భంగా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి 26 వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు ఈ ఫ్లాష్ డీల్‌లో వినియోగదారులు వన్ ప్లస్ 3ని బుక్ చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇలా బుక్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ బుకింగ్స్ సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
 
గతంలో జియోమి సంస్థ 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది వినియోగదారులు మాత్రం ఈ ఫ్లాష్ సేల్‌ ఒట్టి బోగస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ అని ప్రకటించడంతో చాలామంది బుకింగ్ టైం వరకూ వేచి చూశారు. తీరా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఔట్ ఆఫ్ స్టాక్ అని కనిపించడంతో అందరిలోనూ నిరాశ నెలకొంది. మరి వన్ ప్లస్ 3 మోడల్ సేల్స్ ఏమేరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి