ఫేస్‌బుక్‌తో హంగామా వద్దు.. ఏవి పడితే అవి పోస్ట్ చేయకండి.. పిల్లల ఫోటోల్ని వాడకండి!
మంగళవారం, 5 జులై 2016 (12:31 IST)
ప్రస్తుత సమాజంపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దాదాపుగా ప్రతి ఒక్కరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లో ఉంటారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా.. అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు సందడి చేస్తున్నాయి. మానవ జీవితంలోకి అంతలా పెనవేసుకుని పోయిందీ టెక్నాలజీ. అయితే వాటిని సక్రమంగా వినియోగించులేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఇటీవలికాలంలో ఆధునిక సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందంటే.... మంచి, చెడు ఏది జరిగినా సామాజికమాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పలు అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అందుకే ఫేస్బుక్లో ఎలాంటి అంశాలు పోస్ట్ చేయకూడదో తెలుసుకుంటే ఇలాంటి వాటిని అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
ఫేస్బుక్లో ఉండే అంశాల్ని కాపీ పేస్ట్ చేయొద్దని అంటున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కొంతమంది ఇంటి నెంబర్‌తో సహా పూర్తి చిరునామాను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు. దీనివల్ల దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుందని అలాంటి పనులను చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను పదే పదే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు. పిల్లల ఫొటోలను పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడం సంగతి అటుంచితే... కొంతమంది చేసే నెగెటివ్ కామెంట్స్ పిల్లల్ని మానసికంగా వేధిస్తుందట. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు.
చాలామంది తమ పాస్ట్‌పోర్టు నెంబర్ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు కాని ఇది చాలా ప్రమాదకరం. ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సిఉంటుంది.
ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్‌ని సంతోషం ఉండబట్టలేక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్‌ను కొందరు మార్ఫింగ్ కారణంగా ఆ నగదును కొట్టేశారు.