తెలిసి కూడా దక్కించుకోలేని నువ్వే మూర్ఖుడివి...

మంగళవారం, 5 నవంబరు 2013 (18:30 IST)
FILE
ఏటిలో బట్టలు ఉతుకుతున్న రజకుడికి మిలమిలా మెరిసే రాయి ఒకటి కన్పించింది. అతను దాన్ని తీసుకుని తన గాడిద మెడకు అలంకరించాడు. బట్టలను ఇవ్వడానికి ఊళ్లోకి వెళ్లినప్పుడు ఆ రాయిని ఒక నగల వ్యాపారి గమనించాడు.

రజకునితో..." ఆ రాయిని నాకివ్వు. ఒక రూపాయి ఇస్తాను" అన్నాడు. " 5 రూపాయిలిస్తే ఇస్తాను" అన్నాడు రజకుడు. వ్యాపారి 2 రూపాయలు 3 రూపాయలు అంటూ బేరం మొదలుపెట్టాడు. పక్క కొట్టులో ఉన్నతను ఇదంతా చూసి ఒకటే మాట... వెయ్యి రూపాయిలిస్తాను అని అన్నాడు.

వెంటనే రజకుడు వెయ్యి రూపాయిలు తీసుకుని రాయిని అతడికి ఇచ్చాడు. ఇంతలో మొదటి వ్యాపారి విసుగ్గా రజకునితో... ఒరేయ్ మూర్ఖుడా... అది మామూలు రాయి కాదురా, వజ్రం. లక్షకు పైగా ఖరీదు చేస్తుంది. వెయ్యికి అమ్మేసి మోసపోకు అంటూ చెప్పాడు.

దానికి రజకుడు... " కావచ్చు. కానీ నాకు మాత్రం అది కేవలం ఓ రాయి. దాని విలువ నాకు తెలీదు. నీకు తెలుసు. తెలిసి కూడా నాతో బేరాలాడిన నువ్వే మూర్ఖుడివి అన్నాడు.

వెబ్దునియా పై చదవండి