పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

గురువారం, 29 సెప్టెంబరు 2011 (22:14 IST)
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు మొదటిరోజులో భాగంగా శ్రీవారి ఆలయ సమీపంలో ఉన్న ధ్వజస్తంభంపై గరుడని యొక్క చిహ్నం ఉన్న జెండా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

గురువారం రాత్రి 10 గంటలకు పెద్దశేష వాహనంపై వెంకటేశ్వరుని అద్భుతమైన ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ప్రధాన ఆలయం నాలుగు మాడ వీధులు చుట్టూ మలయప్ప స్వామిని ఊరేగిస్తారు.
WD


బ్రహ్మోత్సవాలలో తొలిరోజున పెద్దశేష వాహనంపై ఊరేగించడంలో అంతరార్థం ఉన్నది. శేష అంటే 'సేవకు' అనే అర్థం ఉన్నది. వైకుంఠంలో నిత్యం శ్రీమహావిష్ణువు సేవలో తరించే వేయిపడగల ఆదిశేషుని గుర్తుగా బ్రహ్మోత్సవాలలో తొలిరోజు పెద్దశేష వాహనంపై గోవిందుడు ఊరేగుతాడు.

అంతేకాదు తిరుమల కొండలు, శ్రీ వెంకటేశ్వరని నివాసం. తిరుమల గిరి ఆదిశేషుని ప్రతిరూపంగా చెపుతారు. అందువల్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రెండు రోజులు పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనాలపై మలయప్ప స్వామిని ఊరేగిస్తారు.