బీజేపీకి గుడ్‌బై చెప్పిన అబ్దుల్ కలాం మేనల్లుడు.. ఎందుకంటే?

సోమవారం, 23 నవంబరు 2015 (17:10 IST)
భారతీయ జనతా పార్టీకి మాజీ రాష్ట్రపతి, భారత అణుశాస్త్ర పితామహుడు దివంగత అబ్దుల్ కలాం మేనల్లుడు సయీద్ ఇబ్రహీం గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఆయన.. అంతే త్వరగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
అబ్దుల్ కలాం జీవించి ఉన్నంత వరకు ఆయనకు ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఓ ఇంటిని కేంద్రం కేటాయించింది. కలాం మరణానంతరం ఈ ఇంటిని స్మారక భవనంగా మార్చాలని మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ, కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా, కేంద్ర మంత్రి మహేష్ శర్మకు నివాసముండేందుకు కేటాయించింది. 
 
ఈ చర్యకు నిరసనగా ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు సయీద్ ఇబ్రహీం ప్రకటించారు. ఢిల్లీలో కలాం ఉన్న భవనాన్ని ఆయన గుర్తుగా స్మారకభవనంగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వం దానిని ఓ కేంద్ర మంత్రికి కేటాయించడంపై తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. ఇప్పటికైనా భవనాన్ని కలాం గుర్తుగా జాతీయ విజ్ఞాన కేంద్రంగా మార్చాలని సయీద్‌ కోరారు. కానీ దానిని కేంద్ర మంత్రికి కేటాయించడంపై ఆయన అసంతృప్తితో పార్టీ నుంచి వైదొలిగారు.

వెబ్దునియా పై చదవండి