ఇక రైల్వే స్టేషన్​లో ఎదురుచూపులకు చెక్

శనివారం, 29 ఫిబ్రవరి 2020 (08:38 IST)
రైలు ఆలస్యమవుతుందని తెలియక... రైల్వే స్టేషన్​లో గంటల తరబడి వేచిచూస్తున్నారా? మీ ఎదురుచూపులకు దక్షిణ మధ్య రైల్వే చెక్​ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే రైలు కదలికలు మీ కళ్ల ముందే కనిపించే రియల్‌టైం ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో మహబూబాబాద్‌ వెళ్లేందుకు రాజశేఖర్‌ బయల్దేరాడు. సికింద్రాబాద్‌ వెళ్లాక రైలు ఆలస్యమని.. ఉదయం ఎనిమిదికి బదులు పది గంటలకు వస్తుందని స్టేషన్‌లో ప్రకటించారు. అప్పటివరకు రెండు గంటలపాటు స్టేషన్‌లోనే కూర్చోవాల్సి వచ్చింది.

ఇలా స్టేషన్లలో గంటల తరబడి రైళ్ల కోసం ఎదురుచూడాల్సిన ఇబ్బందులు త్వరలో తొలగిపోనున్నాయి. రైలు కదలికలు ప్రయాణికుల కళ్ల ముందే కనిపించే రియల్‌టైం ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌టీఐఎస్‌)ను దక్షిణ మధ్య రైల్వే సహా దేశవ్యాప్తంగా రెండు నెలల్లోగా అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది.

సరికొత్త విధానం ఎక్కాల్సిన రైలు ఎక్కడుందన్నది తెలుసుకునేందుకు నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వయిరీ సిస్టమ్‌(ఎన్‌టీఈఎస్‌) ఉంది. వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఆ ప్రయోజనం పరిమితం. ఉదాహరణకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌లో బయలుదేరితే ఆ తర్వాత ఆగేది కాజీపేటలోనే.

రైలు ఆలస్యమైనా, మధ్యలో ఆగినా సమాచారం అందదు. అదే.. రియల్‌ టైం ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లో అయితే మార్గమధ్యలో రైలు కచ్చితంగా ఎక్కడ ఉందన్నది.. ప్రతి 30 సెకన్లకు ఒకసారి అప్‌డేట్‌ అవుతుంది. ప్రమాదాలు నివారించవచ్చు రైళ్లను లైవ్‌గా ట్రాక్‌ చేసేందుకు రైల్వేశాఖలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(క్రిస్‌) ఇస్రో సహకారం తీసుకుంటోంది.

రైలు ఇంజిన్‌ లోపల, పైభాగంలో ప్రత్యేక డివైజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఇస్రో శాటిలైట్లతో అనుసంధానం చేస్తున్నారు. తద్వారా రైలు ఎక్కడ ఉంది.. ఎంత వేగంతో వెళుతుందన్న వివరాల్ని ఇంజిన్‌లోని పరికరాలు ఎప్పటికప్పుడు పంపిస్తాయి. ఈ సాంకేతికత ద్వారా ప్రమాదాలనూ నివారించవచ్చు.

రైలు వెనుక రైలు!
స్టేషన్‌లో ఒక రైలు బయల్దేరింది అంటే.. అది మరో స్టేషన్‌ చేరుకున్న తర్వాత గాని రెండో రైలుకు కదిలేందుకు అనుమతి ఇవ్వరు. కొత్త విధానం రియల్‌ టైం ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌తో రైలు వెనుక మరో రైలు బయల్దేరేందుకు సాంకేతికంగా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తద్వారా ప్రధాన స్టేషన్లు, రద్దీ మార్గాల్లో రైళ్లు త్వరత్వరగా బయల్దేరేందుకు వీలుంటుందంటున్నారు. ఒకవేళ ముందు బయల్దేరిన రైలు మార్గమధ్యలో ఆగినా, ప్రమాదానికి గురైనా.. వెనుకనుంచి వచ్చే రైలు ఢీకొనే ప్రమాదం ఉండదని.. ముందు రైలు మధ్యలో ఆగిన విషయం కూడా వెనుక రైలు డ్రైవర్‌కు సమాచారం అందుతుందని ఓ నిపుణుడు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు