తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్లేందుకు మరో ఇద్దరితో కలిసి స్పైస్ జెట్ ఎస్జీ-8194 అనే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరంతా విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే బోర్డింగ్ ముగిసిందని, విమానంలోకి అనుమతించలేమని స్పైస్ జెట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారి ఓ ఉద్యోగి చెంప పగులగొట్టాడు. అతనితో ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో గొడవకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ రావాల్సి వచ్చింది.
ఆపై విమానాశ్రయ ఉద్యోగిని, పోలీసును, మరో ఇద్దరినీ తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు. అయితే, ఇరు పక్షాలు రాజీకి రావడంతో ఈ విషయమై ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు పోలీసు అధికారిని, అతనితో పాటు ఉన్న ఇద్దరినీ విమానంలో ప్రయాణించేందుకు మాత్రం స్పైస్ జెట్ అంగీకరించ లేదు.