కరోనాకు పతంజలి మందు... మూడు రోజుల్లోనే నయం... బాబా రాందేవ్
మంగళవారం, 23 జూన్ 2020 (13:49 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి పతంజలి సంస్థ ఆయుర్వేద మందును తీసుకొచ్చింది. 'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును తీసుకొచ్చారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని ఆ సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు.
ఇదే అంశంపై రాందేవ్ బాబా హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు.
ఇలాంటి సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు.
కాగా, భారత ఫార్మా దిగ్గజ కంపెనీలో గ్లెన్ మార్క్, హెటిరో, సిప్లా కంపెనీలు కూడా కరోనాకు ఫెబిఫ్లూ పేరుతో మాత్రలు, సూది మందును మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెల్సిందే.