వార్దా తుఫానుతో చెన్నైకి ముప్పు పొంచివుంది. వార్దా తుఫాన్ చెన్నై వైపు కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతోంది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 480 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పెను తుఫాన్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలుచోట్ల బారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వార్దా తుఫాన్ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం చూపనుంది. తీరంలో పెనుగాలుల తీవ్రత పెరుగుతోంది.
ఆదివారం దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ ప్రభావిత నాలుగు జిల్లాల కలెక్టర్లు, అదికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.