దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రభుత్వ కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా, ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం జనవరి 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లకు జనవరి 21 తుదిగడువు అని వెల్లడించింది.
జనవరి 22వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు జనవరి 24వరకు సమయం ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనను సోమవారం విడుదల చేసింది.