పూణె: ప్రైవేటు ఆసుపత్రులంటే... రోగుల్ని జలగల్లా పీల్చేస్తారని భయపడుతున్నరోజులివి. కానీ, పూణెలో ఓ మహానుభావుడు తన ఆసుపత్రిలో సంచలనాత్మక సేవాభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. మహారాష్ట్రలోని పూణెలో డాక్టర్ గణేష్ రాఖ్ అనే ఓ వైద్యుడు సొంతగా హాస్పిటల్ నడుపుతున్నాడు. ఆయన హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే... పైసా కూడా బిల్లు వసూలు చేయనని శపథం చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది. ఆయన ఆసుపత్రిలో ప్రసవం కోసం గర్భిణులు వచ్చేవారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి తమకు కొడుకే జన్మించాలని ప్రార్థించేవారు. ఈ క్రమంలో కొందరికి కొడుకే పుట్టేవాడు. అలాంటి వారు హాస్పిటల్‌లోనే వేడుకలు జరుపుకునే వారు.
కూతురు జన్మించిన వారు మాత్రం ప్రసవించిన మహిళను, ఆ శిశువును చూడకుండానే వెళ్లిపోయేవారు. ప్రసవించిన తల్లిని ఛీత్కారంగా చూసేవారు. అలాంటి వారందరినీ డాక్టర్ గణేష్ రాఖ్ దగ్గరగా పరిశీలించాడు. దీంతోపాటు ఏటా బాలురు, బాలికల నిష్పత్తి తగ్గిపోతుండటాన్ని కూడా అతను గమనించాడు. దీంతో ఎలాగైనా ఆడ శిశువును రక్షించాలని, వారు కూడా మగ శిశువులతో సమానమేనని నిరూపించాలని అనుకున్నాడు ఈ డాక్టర్. అలా అనుకుని ఎవరూ తీసుకోని ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన హాస్పిటల్‌కు ప్రసవం కోసం వచ్చే మహిళలకు ఒకవేళ ఆడశిశువు పుడితే ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఫీజు, బిల్స్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.
అయితే డాక్టర్ గణేష్ రాఖ్ తీసుకున్న నిర్ణయం అతని కుటుంబ సభ్యులకు నచ్చలేదు. హాస్పిటల్‌లో ఫీజులు, బిల్స్ తీసుకోకపోతే మనం ఎలా జీవించాలని వారు అతన్ని ప్రశ్నించారు. కానీ గణేష్ రాఖ్ తండ్రి ఆదినాథ్ విఠల్ రాఖ్ మాత్రమే తన కొడుకు నిర్ణయాన్ని సమర్థించాడు. దీంతో గణేష్‌కు ధైర్యం లభించింది. ఆ తెగువతోనే తాను అనుకున్నది పాటించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి తన హాస్పిటల్‌కు వచ్చే గర్భిణులకు ఇలా సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ డాక్టర్ గణేష్ రాఖ్ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.