గూఢచర్యం ఆరోపణలపై భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ మండిపడింది. ఆయనకు శిక్ష అమలుచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.
అయితే, బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్కే.సింగ్ మాత్రం మరో సందేహాన్ని వ్యక్తం చేశారు. పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇప్పటికే చిత్రహింసల పాల్జేసి చంపి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ‘పాక్ జాదవ్‌ను టార్చర్ చేసి హత్య చేసి ఉంటుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి సైనిక కోర్టు విచారణ పేరిట కథలు అల్లుతోంది’ అని తెలిపారు
ఇంకోవైపు.. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కు మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను పాక్ వెంటనే అమలు చేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జాదవ్‌కు కొన్ని న్యాయపరమైన అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. మరణశిక్ష తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశంతోపాటు క్షమాభిక్ష కోరుతూ ఆదే అధ్యక్షుడికి విన్నవించుకునే అవకాశం జాదవ్‌కు ఉందని చెబుతున్నారు. ఈ ప్రక్రియకు నాలుగు నెలల గడువు ఉంటుంది.