పేక మేడలా కూలిన ఏడంతస్తుల భవనం.. శిథిలాల కింద 20 మంది కార్మికులు?

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (10:31 IST)
హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతమైన నానక్‌రాంగూడ లోథా బస్తీలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసిన ఏడు అంతస్తుల కొత్త భవనం ఒకటి పేకమేడలా కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కూలీలో మృత్యువాతపడివుంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీశారు. 
 
చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ సినిమా తరహాలో జరిగిన దుర్ఘటనలో విశాఖ జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాలు పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పై పడటంతో అది కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ప్రమాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
 
స్థానికుల సమాచారం ప్రకారం.. లోథా బస్తీలో సత్యనారాయణ సింగ్‌ అలియాస్‌ సత్తు సింగ్‌ ఏడాది క్రితం గ్రామకంఠంకు చెందిన 266 గజాల స్థలంలో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అనుమతులు లేకుండా జీ + 6 భవంతిని నిర్మిస్తున్నాడని, నిర్మాణం నాసిరకంగా ఉందంటూ నిర్మాణ సమయం నుంచే స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా వెళ్లాయి. అంత పెద్ద స్థలానికి 16 పిల్లర్లు నిర్మించినా, పుట్టింగ్‌లు సరిగా లేవని అనేక సందర్భాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. 
 
దీనికి కారణం సత్తు సింగ్ తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి సన్నిహితుడు కావడమే. మంత్రి తోడ్పాటు ఉండడంతో ఫిర్యాదు చేసిన ప్రతిసారి అధికారులు రావడం ఫొటోలు తీసుకొని వెళ్లడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే, రెండు నెలల కిందట భవన నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసి గృహ ప్రవేశం చేశాడు. పెయింటింగ్‌, గ్రానైట్‌, వైరింగ్‌, ఫర్నిచర్‌ పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి విశాఖపట్నంకు చెందిన వలస కూలీలకు బాధ్యత అప్పగించాడు. వీరంతా భవనంలోని సెల్లార్‌లోనే నివసిస్తూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

వెబ్దునియా పై చదవండి