2027 వరకు శశికళ ఎన్నికల్లో పోటీకి కష్టమే?

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:59 IST)
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ జైలు నుంచి, అనారోగ్యం నుంచి బయటపడినా ఎన్నికల్లో పోటీ చేసే వ్యవహారంలో మాత్రం చిక్కుకుపోయారు. శశికళ అభిమానులు కోరుకుంటున్నట్టుగా రాజకీయాల్లో ‘క్రియాశీలక పాత్ర’ పోషించవచ్చు గానీ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పట్లో అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నట్టుగా ఆమె ఏ పార్టీపై పట్టు సాధించినా తన అనుయాయు లను అందలమెక్కించేందుకు తోడ్పడగలరు గానీ, ఆమె మాత్రం ఉన్నతస్థానంపై కూర్చోలేరని వారు విశ్లేషిస్తున్నారు.

నేరాల విషయంలో ఒక వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష,  జరిమానా విధించినట్టయితే వారు శిక్షార్హమైన తేదీ నుంచి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే. ఏది ఏమైనప్పటికీ సదరు వ్యక్తి ఆ నేరాలకు జైలుశిక్ష అనుభవిస్తే, వారు జైలు నుంచి విడుదలైన ఆరేళ్లదాకా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు.

శశికళ కూడా జరిమానా చెల్లించడంతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించినందున ఆమె విడుదలైన తేదీ నుంచి మరో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. 1988 పీసీ యాక్ట్‌ కింద 2002లో కేంద్రం అనర్హత నిబంధనలకు సంబంధించి చేసిన చట్టసవరణతోనే శశికళకు చిక్కొచ్చిపడింది.

అక్రమాస్తుల కేసును విచారించిన బెంగుళూరు ట్రయల్‌ కోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 109 (ఒక నేరానికి పాల్పడడం), 120-బి (క్రిమినల్‌ కుట్ర) 13 (1)(ఇ) సెక్షన్ల ప్రకారం, 1998 పీసీ యాక్ట్‌లోని 13(డి) ప్రకారం ప్రభుత్వోద్యోగి ద్వారా అక్రమార్జన చేయడం తదితరాలకు సంబంధించి ఆమెను దోషిగా తేల్చింది.

ట్రయల్‌ కోర్టు జడ్జి జాన్‌ మైకేల్‌ కున్హా ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్లా 10 వేల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబరు 27వ తేదీన తీర్పు ఇచ్చారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీన ఆ తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దీంతో ఆ మరునాడే శశికళ జైలుకెళ్లారు. అందువల్ల గత జనవరి 27వ తేదీన జైలు నుంచి విడుదలైన శశికళ ఆ రోజు నుంచి ఆరేళ్ల పాటు.. అనగా 2027 జనవరి 26వ తేదీలోగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు. 
 
ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ ఐదేళ్ల తరువాత అంటే 2026 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లోనూ శశికళ పోటీ చేయలేరు. అదే విధంగా అన్నీ సాఫీగా సాగితే 2024లో పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి.

ఆ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయలేరు. అంటే శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2031 వరకు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2029 వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ 2027 జనవరి తరువాత రాష్ట్రంలో ఏదైనా ఉప ఎన్నిక జరిగితే ఆమె పోటీ చేసేందుకు అవకాశముంది. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు