పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగం జరుగనుంది. ఆదివారం (సెప్టెంబర్-16) రాత్రి పది గంటల 8 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ నౌకను నింగిలోకి ప్రవేశపెడతారు.
ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమని.. దీని ద్వారా బ్రిటన్‌కు చెందిన 889 కిలోల బరువైన నోవాసర్, S1-A ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ రూపకల్పన చేసింది. పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
ఆదివారం రాత్రి 10.07కు ప్రయోగాన్ని నిర్వహించాలని మొదట నిర్ణయించినా వర్షం పడే అవకాశముండటంతో రాకెట్ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్ధాలను తప్పించుకునేందుకు ఒక నిమిషం పొడిగించి ప్రయోగ సమయాన్ని 10.08గా నిర్ణయించారు. ఇక 33గంటల కౌంట్ డౌన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్‌ను నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి పరిశీలించారు.