భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే జీశాట్-6ఏ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ గురువారం ప్రత్యేక వాహంలో తీసుకొచ్చారు.
ఈ ప్రయోగానికి సంబంధించి రెండో ప్రయోగ వేదిక రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవేత్తలు పూర్తిచేశారు. 2,140 కిలోల బరువు గల జీశాట్-6ఏ ఉపగ్రహం సమాచార రంగానికి చెందింది. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో ఈ ఉపగ్రహ ప్రయోగం చేపడుతుంది. ఇది విజయవంతమైతే పదేళ్ల పాటు సేవలు అందించనుంది. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే మార్చి 29వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్08ను నింగిలోకి పంపించనున్నారు.