'మీరు పాలించకూడదని భావించామేగానీ... జీవించకూడదని భావించలేదు అమ్మా'.. డీఎంకే నేతలు

గురువారం, 8 డిశెంబరు 2016 (10:47 IST)
ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంత కాలం డీఎంకే నేతలకు బద్ధ శత్రువు. ఒకరిపై ఒకరు నిత్యం మాటల తూటాలు పేల్చుకునేవారు. లేనిపోని విమర్శలు గుప్పించుకునేవారు. కానీ, జయలలిత మరణం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జయలలిత పట్ల అపారమైన ప్రేమ, గౌరవ మర్యాదలను డీఎంకే నేతలు ప్రదర్శిస్తున్నారు. జయలలితపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒక ప్రత్యర్థిపై ఎన్నడూ లేనివిధంగా పొగడ్తల వర్షం కురిపించడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అయితే, జయలలిత మరణించిన తర్వాత ఆమెకు సంతాపం తెలుపుతూ రాష్ట్రంలోని పలుచోట్ల డీఎంకే తరపున బ్యానర్లు వెలుస్తున్నాయి. అందులో ఈరోడు జిల్లా గోపీలో వెలసిన ఓ బ్యానరు ప్రత్యేకంగా నిలుస్తోంది. జయలలిత తమకు రాజకీయ శత్రువు మాత్రమేనని డీఎంకే స్థానిక వర్గాలు స్పష్టం చేశాయి. 
 
ఆ బ్యానరులో 'విరోధిగా ఉన్నప్పటికీ ఎదుట నిలిచింది సింహమనే హుందాతో ఉన్నాం. మీరు పాలించకూడదని భావించామేగానీ... జీవించకూడదని ఎన్నటికీ భావించలేదు తల్లి. ఇక ఎక్కడ చూస్తాం.. ఇలాంటి ఖ్యాతికలిగిన మహోన్నతులను'... అని పేర్కొంది. ఆ ఫ్లెక్సీలో జయలలిత చిత్రం కూడా ఉండటంతో స్థానిక అన్నాడీఎంకే నిర్వాహకులు సైతం చలించిపోయారు. ఈ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి