ఆడ పిల్లల పెళ్లి వయసును 18 యేళ్లుగా నిర్ణయించడం ఒక వ్యాధివంటిందని, అందుకే సమాజంలో లవ్ జిహాద్ (హిందూ యువతులకు ఎరవేసి ముస్లిం యువకులు పెళ్లి చేసుకోవడం) ఘటనలు పెరిగిపోతున్నాయంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మార్ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ పెళ్లి వయసు నిబంధన వల్లే యవతులు లేచిపోవడానికి కూడా ఇదే కారణమన్నారు. మన పూర్వీకులు చిన్నతనంలోనే పెండ్లిళ్లు కుదిర్చేవారు. బాల్యవివాహాల బంధాలు సుదీర్ఘకాలంపాటు కొనసాగేవి. ప్రభుత్వం ఎప్పుడైతే యువతులకు పెండ్లి చేయడానికి 18 సంవత్సరాలు నిండాలని చట్టం చేసిందో.. మన అమ్మాయిలు లేచిపోవడం.. లవ్ జిహాద్ వంటి కుట్రలు ప్రారంభమయ్యాయి అని పర్మార్ వివరించారు.
ప్రభుత్వం మంచి ఉద్దేశంతో యువతుల పెండ్లిళ్లకు చట్టబద్ధమైన వయస్సును నిర్దేశించింది. కానీ కొంతమంది ముస్లిం యువకులు తమ పేర్లను మార్చుకొని హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారు. 18 యేళ్ల కంటే ముందే వివాహం చేయమని నేను చెప్పడం లేదు. వివాహ వయస్సు వచ్చేలోపు పెద్దలు పెళ్లిళ్లు కుదుర్చడం మంచిది. అప్పుడు యువతులకు ఎవరూ వల వేయరు అని పర్మార్ అభిప్రాయపడ్డారు.