వ్యాక్సిన్ వేయించుకుంటేనే వేతనాలు : మధ్యప్రదేశ్ సర్కారు

బుధవారం, 23 జూన్ 2021 (20:00 IST)
దేశంలో కరోనా వైరస్ మారణహోమాన్ని సృష్టించింది. ఈ వైరస్ దెబ్బకు అనేక రాష్ట్రాలు తల్లడిల్లిపోయాయు. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అదేసమయంలో దేశ ప్రజలందరికీ కరోనా టీకాలను ప్రభుత్వాలు వేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాయి. 
 
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒకటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదునైన అస్త్రం. అందుకే దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నాయి. 
 
వ్యాక్సిన్ వేసుకోవాలని అందరినీ కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇంకా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనకాడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా​ కలెక్టర్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ టీకా వేయించుకున్న ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఉజ్జయిని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
జూలై 31 లోపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే ఆ నెల జీతం రాదని తేల్చి చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు ధృవ పత్రాలు అందజేయాలని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ నమోదు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు