శివసేన ఎంపీ నోటిదూల.. డబ్బులు లేవని పోలీసులను బూతులు తిట్టాడు... ఏటీఎం ఎదుట ఆదోళన

గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:35 IST)
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. చేతివాటం, నోటి దురుసుతనం ఏమాత్రం తగ్గలేదు. ఎయిరిండియా మేనేజర్‌ని చెప్పుతో కొట్టిన ఘటనలో ఆయన నైజం దేశ ప్రజలకు తెలిసింది. ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది... మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌లో ఏటీఎం సరిగా పనిచేయడంలేదంటూ.. పోలీసులపై తిట్లపురాణం అందుకున్నారాయన. గైక్వాడ్‌తో పాటు ఆయన అనుచరగణం కూడా పోలీసులపై ఇష్టారీతిన మాటలు వదలడంతో కొందరు ఆ సంభాషణలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇపుడు ఇవి వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వివాదానికి కారణాలు పరిశీలిస్తే... బుధవారం లాతూర్ వచ్చి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు తన అనుచరుడొకరిని ఏటీఎంలోకి పంపారు. అయితే అందులో డబ్బులు లేవంటూ అతడు ఒట్టిచేతులతో తిరిగొచ్చాడు. మిగతా కొన్ని ఏటీఎంలలో కూడా అదేపరిస్థితి ఉండడంతో... ఎంపీ ఓ ఏటీఎం ముందు తన మద్దతుదారులతో కలిసి ఆందోళన మొదలుపెట్టారు.
 
'నోట్లరద్దు తర్వాత సాధారణ పరిస్థితి వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని 50 రోజుల సమయం అడిగింది. వాళ్లకు మేం 100 రోజులు.. ఆ తర్వాత 200 రోజులు సమయం ఇచ్చాం. దీని బాధ్యత కేంద్ర, రాష్ట్రాల ఆర్థక మంత్రులదే...' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించడంతో... ఆందోళన విరమించాలని పోలీసులు గైక్వాడ్‌ను కోరారు. కానీ, ఆయన మాత్రం పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి