దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన వీకె.శశికళ నటరాజన్‌ను ఆ పార్టీకి చెందిన చెందిన కార్యర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ తమిళ చానెల్ నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా, ముఖ్యమంత్రిగా కూడా ఆమెను 94 శాతం మంది అన్నాడీఎంకే శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. అదేసమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారు మాత్రమే శశికళ నాయకత్వానికి జై కొడుతున్నారనే విషయం ఈ సర్వే ద్వారా తేటతెల్లమైంది.
మరోవైపు.... 'చిన్నమ్మ(శశికళ) ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ జయలలిత ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే.నగర్ వాసులు అంటున్నారు. ఆమె చనిపోవడంతో ప్రస్తుతం అదేచోటు నుంచి ప్రస్తుతం పార్టీ పగ్గాలు చేతబట్టి ముఖ్యమంత్రి పదవికై సాగుతున్న శశికళ పోటీ చేయాలనుకుంటున్నారు.
కానీ, ఇక్కడి ప్రజల నుంచి శశికళకు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడి వారంతా శశికళను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని అంటున్నారు. ఇది జయమ్మ చోటని శశికళను అనుమతించం అంటున్నారు. ఇప్పటికే కొంతమంది గ్రూపులుగా వెళ్లి శశికళ ఆర్కే నగర్ నుంచి పోటీ చేసేందుకు రావొద్దని, తమను ఓట్లు అడగవద్దని తెగేసి చెప్పారుకూడా. దీంతో శశికళ వెస్ట్రన్ రీజియన్‌లో ఉన్న నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంచుకునే పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.