కర్నాటకలో బిర్యానీ కోసం కిలోమీటరు క్యూలో జనం బారులు

గురువారం, 1 అక్టోబరు 2020 (17:59 IST)
కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి ఆహారానికి  దూరమైన జనాలు.. రెస్టారెంట్ల భోజనం కోసం ఆత్రూతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని రెస్టారెంట్ల వద్ద బిర్యానీ కోసం బారులు తీరారు. 
 
బిర్యానీ కోసం హోస్కోటేలోని బాగా ప్రచుర్యం పొందిన ఆనంద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద ఏకంగా కిలోమీటరున్నర క్యూలో ప్రజలు నిల్చుకోవడం గమనార్హం. ఆదివారం రోజున ఈ బిర్యానీ ప్రియులు తమ బిర్యానీ కోసం కిలోమీటరున్నర లైనులో నిల్చున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
 
 బెంగళూరులోని హోస్కోటే రెస్టారెంట్ వద్ద ఈ క్యూ.. ఇక్కడేమైనా బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నారా? ఏంటి? అని ప్రశ్నించారు. ఆ వీడియోలో మాస్కులు ధరించిన ప్రజలు క్యూలో నిల్చున్నారు.
 
అయితే, భౌతిక దూరం అనే మాటకు అక్కడ చోటు లేనట్లుగా కనిపించింది. ఇంత భారీ ఎత్తున జనాలు రావడంతో లాక్‌డౌన్ ముందు కంటే 20 శాతం బిర్యానీ అమ్మకాలు పెరిగాయని ఆనంద్ రెస్టారెంట్ యజమాని చెప్పడం గమనార్హం. బెంగళూరు సిటీ సెంటర్‌కు ఈ రెస్టారెంట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారీగా జనం చేరుకుంటున్న నేపథ్యంలో కొందరు సాయంత్రంలోపే రెస్టారెంట్ వద్దకు చేరుకుని తమ బిర్యానీ తెచ్చుకుంటున్నారు.
 
కాగా, రెస్టారెంట్ వద్ద క్యూకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కరోనాకి భయపడేవారే లేరిక్కడ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి క్యూలు కేవలం మద్యం షాపుల వద్దే ఉంటాయనుకుంటా.. అని మరో నెటిజన్ పేర్కొన్నారు. తానైతే అమృతం కోసం కూడా ఇలా క్యూలో నిలబడనంటూ ఇంకో నెటిజన్ల వ్యాఖ్యానించాడు. వారంలో మూడు రోజులు మాత్రమే వారు సర్వ్ చేస్తారని, దీంతో ఉదయం నుంచే జనాలు రెస్టారెంట్ వద్దకు చేరుకుంటున్నారని మరొకరు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు