'సుప్రీంకోర్టు' చరిత్రలో తొలిసారి - జడ్జిగా తెలుగు తేజం

మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:45 IST)
సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనుండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
కరోనా కారణంగా ముందు నిర్ణయించిన సుప్రీంకోర్టు 1వ ప్రాంగణంలో కాకుండా అదనపు భవనం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒకేసారి 9 మంది జడ్జిలతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 
 
అంతేకాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించారు. సంప్రదాయంగా అయితే సీజేఐ కోర్టు రూమ్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 9 మంది కొత్తవారితో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి 33కు చేరుతుంది
 
ఇదిలావుంటే, ఈ తొమ్మిది న్యాయమూర్తుల్లో ఒకరు తెలుగుతేజం ఉండటం గమనార్హం. గత మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన పమిడిఘంటం శ్రీనరసింహ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా, పండితుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనరసింహ.. న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తి కానున్నారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీనరసింహకు.. 2028లో అతి తక్కువకాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే అద్భుత అవకాశం కూడా దక్కనుంది. 
 
ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించే తెలుగువాడు ఆయనే అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ పమిడిఘంటం కోదండరామయ్య కుమారుడైన నరసింహ.. తన తండ్రి మార్గదర్శకత్వమే తనను ఈ స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు