నన్ను రేప్ చేసిన నేత బెయిలుపై బయటికొచ్చాడు : బీహార్ సీఎంకి బాధితురాలి వాట్సాప్ మెసేజ్

గురువారం, 6 అక్టోబరు 2016 (10:35 IST)
తనను రేప్ చేసిన బడా రాజకీయనేత బెయిల్‌పై బయటకొచ్చాడని, ఇప్పుడు తనకు చాలా భయంగా ఉందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని బెంబేలెత్తిపోతున్నానని 15 ఓ బాలిక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వాట్స్‌యాప్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... గత ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లాబ్ యాదవ్ ఓ మహిళ ద్వారా పదో తరగతి బాలికను రేప్ చేశాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, '30 వేల రూపాయలు ఇస్తాను, కేసు విత్ డ్రా చేసుకో' అంటూ బాలికకు ఆఫర్ ఇవ్వగా ఆమె అందుకు నిరాకరించింది. 
 
దీంతో ఏం చేయాలో తోచక... నెల రోజుల అజ్ఞాతవాసం తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత రిమాండ్‌కు పంపాడు. అతనికి తాజాగా బెయిల్ మంజూరు కావడంతో సదరు బాలిక బెంబేలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో వాట్స్‌యాప్ ద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఆమె మెసేజ్ పంపింది. అందులో...'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నేను నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. నాపై ఆ దుర్మార్గుడు చేసిన అఘాయిత్యంతో నేను సర్వం కోల్పోయాను.
 
ఇప్పుడు నేను కొత్తగా కోల్పోయేందుకు ఏమీ లేదు. అయితే, నా కుటుంబాన్ని కోల్పోతానేమోనని భయమేస్తోంది. అతను నన్ను, నా కుటుంబాన్ని ఏ క్షణంలో నైనా అతను చంపగలడు. అతనికి పోలీసులు కూడా భయపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రాజ్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరుపనుంది. 

వెబ్దునియా పై చదవండి