ఎంతగానో ఆసక్తిని రేకెత్తించిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం ఆదివారం సాయంత్రం వెల్లడైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయభేరీ మోగించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీ చేసి గెలుపొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత కంటే అధిక మెజార్టీతో గెలుపొంది సరికొత్త చరిత్రను సృష్టించారు.
ఈ ఎన్నికల్లో దినకరన్‌కు మొత్తం 50.32 శాతం ఓట్లు లభించాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత 39,545 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇపుడు దినకరన్ ఈ మెజార్టీని అధికమించారు. నాడు జయలలిలత సాధించిన మెజారిటీ కంటే 1,162 ఓట్లు అధికంగా దినకరన్ సాధించాడు.
మరోవైపు, ఈ ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు డిపాజిట్ కోల్పోయింది. డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కు కేవలం 24651 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే, అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ సీనియర్ నేత ఇ. మధుసూదనన్‌కు 48306 ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కరు నాగరాజన్ పోటీ చేశారు. ఈయనకు 1417 ఓట్లు మాత్రమే పోల్ కాగా, నోటాకు 2373 ఓట్లు, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థికి 3860 ఓట్లు వచ్చాయి. ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
కాగా, ఈ ఎన్నికల్లో దినకరన్ విజయం సాధించగా, అన్నాడీఎంకే రెండో స్థానంలోనూ, డీఎంకే మూడో స్థానంలోనూ, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 59 మంది అభ్యర్థుల్లో డీఎంకే అభ్యర్థితో సహా 57 మంది అభ్యర్థులు ధరావత్తును కోల్పోయారు.