ఎన్నికలు దగ్గరవుతున్నప్పుడు నాయకులకు పబ్లిసిటీ సరదా పుడుతుంది. ఉచితాలు, కరెన్సీ నోట్లు వగైరాలతో ఓటర్లకు విసిరే ప్రలోభాల వల ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది కానీ, ఈలోపు నెటిజన్లను మంచి చేసుకుందామనుకున్నారు పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కానీ ఆ ప్రయత్నంలో కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే - సోమవారం సిద్ధరామయ్య ఓ ట్వీట్ చేసారు. విఐపి కాన్వాయ్‌ల వైపు ఆంబులెన్సులు వస్తే, వాటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పానని, సిబ్బంది సైతం ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఓ ఆంబులెన్సుకు తన కాన్వాయ్ దాటేలా అనుమతించారని దాని సారాంశం. ఇక నెటిజన్ల కీబోర్డుల టకటకలు ముఖ్యమంత్రిగారికి ఓ రేంజిలో తలనొప్పి తెప్పించాయి. ఇది కూడా ఓ ఘనకార్యమా అంటూ ఒకరు.. ఈ సేవకు మీకు తప్పకుండా నోబెల్ బహుమతి ఇవ్వవలసిందేనంటూ మరొకరు.. సిఎం అని కూడా చూడకుండా చెడుగుడు ఆడేశారు.
ఈ మొత్తం వ్యవహారం మీద ఆంధ్ర నాయకుల కామెంట్ మరోలా ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే వ్యంగ్యాస్త్రాలు విసిరితే, కర్ణాటక కాబట్టి సరిపోయింది కానీ, ఆంధ్రలో ఐతే కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నరకం చూపుతారని బాహటంగానే విమర్శిస్తున్నారు. బహుశా ఆంధ్రగాలి ఇంకా కర్ణాటక వైపు మళ్లలేదేమో...