దివంగత ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తిరుగుబాటు ఎగురవేశారు. తాను తన్నీర్ సెల్వం కాదనీ తమిళ 'సింగం'మంటూ గర్జించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ధిక్కార స్వరం వినిపించారు. అమ్మ ఆత్మ సాక్షిగా దేశ ప్రజలకు, కోటిన్నర మంది అన్నాడీఎంకే కార్యకర్తలకు కొన్ని నిజాలు వెల్లడించారు. ఆ ప్రకారంగానే పార్టీలో తాను ఎదుర్కొన్న అవమానాలు ఆయన ఏకరవు పెట్టారు.
అదేసమయంలో తాను అన్నాడీఎంకేను వీడేది లేదన్నారు. పైగా, కొన్ని గంటల్లోనే తానేంటో నిరూపిస్తానని హెచ్చరించారు. మంగళవారం రాత్రి జయ సమాధి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న ఆయనను కలుసుకునేందుకు సీనియర్ ఎంపీ మైత్రేయన్, మరికొంతమంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే, పన్నీర్ సెల్వం వెంట 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకోవైపు... పన్నీర్ సెల్వం తిరుగుబావుటా నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తమ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అదేసమయంలో పన్నీర్ సెల్వం కూడా తన మద్దతుదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్టాలిన్‌తో పన్నీర్ సెల్వంకు సత్సంబంధాలున్న నేపథ్యంలో అవసరమైతే ఆయనకు డీఎంకే మద్దతు ఇస్తుందన్న వూహాగానాలకు ఈ భేటీలతో బలం చేకూరినట్లయింది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో చీలికలు తప్పవన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్ సెల్వంతో కలిపి ఏఐఏడీఎంకేకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది.