సుష్మాకు బళ్లారితో అనుబంధం... ఏటా వరలక్ష్మీ వ్రతం అక్కడే

గురువారం, 8 ఆగస్టు 2019 (07:43 IST)
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. సుష్మాను కర్ణాటక బిడ్డగా బళ్లారి వాసులు గుర్తు చేసుకొంటున్నారు.
 
1999లో కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ పోటీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీపై బీజేపీ అభ్యర్ధిగా సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
 
చివరకు సోనియాగాంధీ విజయం సాధించారు. ఈ ఎన్నికతో బళ్లారికి జాతీయ స్థాయిలో పెద్దఎత్తున గుర్తింపు లభించింది.కర్ణాటకలో బీజేపీ బలోపేతం కావడానికి సుష్మా స్వరాజ్ కూడ కారణంగా చెబుతారు. 
 
బళ్లారి వాసులు సుష్మాస్వరాజ్ ను తల్లిగా పిలుచుకొంటారు. ప్రతి ఏటా ఆమె బళ్లారికి వస్తారు.  ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని బళ్లారిలోనే నిర్వహించుకొంటారు. బళ్లారిలో ఓటమి తర్వాత ఈ మేరకు బళ్లారి ప్రజలకు సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. 
 
సుష్మాస్వరాజ్ కు మద్దతుదారులుగా ఉన్న గాలిజనార్ధన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.  గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీరాములుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.  దీంతో 2011లో ఆమె బలవంతంగా వరలక్ష్మీవ్రతాన్ని నిర్వహించుకోవడానికి బళ్లారి రావడం నిలిపివేసిందని స్థానికులు చెబుతారు.
 
మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కర్ణాటకతో  సుష్మా స్వరాజ్ కు ఉన్న సంబంధాలను  ఆయన గుర్తు చేసుకొన్నారు. కర్ణాటక కూతురుగా సుష్మా స్వరాజ్ ను ఆయన పేర్కొన్నారు. తాము ఎక్కడ కలిసినా కూడ ఆమె కన్నడంలోనే పలుకరించేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.
 
ఎమర్జెన్సీ సమయంలో  సుష్మా స్వరాజ్ ను బెంగుళూరులోని జైలులో ఉంచారు. ఈ సమయంలో ఆమె కన్నడ నేర్చుకొన్నారు. 1999లో ఎన్నికల సమయంలో  ఆమెకు కన్నడ నేర్చుకోవడం కలిసి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు