ఆ మహిళ వయసు 52 యేళ్లు. ఆమెకు 16 మంది పిల్లల్ని కనాలన్న బలమైన ఆశ. ఇప్పటికే తొమ్మిదిసార్లు గర్భందాల్చి, సుఖ ప్రసవమైంది. ఈ 9 మంది పిల్లల్లో ఒకరు మినహా మిగిలిన 8 మంది జీవించే ఉన్నారు. వీరిలో నలుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇపుడు ఈమె మహిళ పదోసారి గర్భందాల్చింది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో తన భర్తను తీసుకుని కనిపించకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట జిల్లా ఆరంతాంగికి సమీపంలోని వేదియన్‌కుడికి చెందిన ఆనందన్ (55), ఆరాయి (52) అనే దంపతులు ఉన్నారు. ఈమెకు ఇది వరకే తొమ్మిది ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. ఒక బిడ్డ ప్రసవంలోనే మృతి చెందగా 8 మంది సంతానం ఉన్నారు. వీరిలో నలుగురికి వివాహాలయ్యాయి.
అయితే, ఆరాయి మళ్లీ గర్భందాల్చింది. ఆమెను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, ఆమెను పరీక్షించిన వైద్యులు.. షుగర్ వ్యాధితో పాటు.. బీపీ ఉన్నట్టు గుర్తించారు. పైగా, మెరుగైన చికిత్సల కోసం ఆమెను పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలకు పంపారు.
అక్కడ రెండుమూడు రోజులు చికిత్స పొందిన తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. పైగా, ఈనెల 18ని ప్రసవతేదీగా వైద్యులు నిర్ధారించారు. దీంతో బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టేందుకు అంబులెన్స్ ద్వారా పుదుకోటై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. కానీ ఆరాయికి మాత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం ఇష్టం లేక తన భర్తతో కలిసి అదృశ్యమైంది. ఇపుడు వారి కోసం వైద్యబృందంతో పాటు.. రెవెన్యూ సిబ్బంది పోలీసులు ఆరా తీస్తున్నారు.
దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆనందన్, అతని భార్యకు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వారు తెలిపారు.