కోడెల అవమానాన్ని భరించలేకపోయారు.. అందుకే ఇలా : చంద్రబాబు భావోద్వేగం

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (17:53 IST)
మాజీ స్పీకర్, పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో కోడెల తనతో మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తోందని వాపోయారని చెప్పారు. 
 
కానీ, తాము మాత్రం 'సమస్యలు వస్తాయి. పోరాడదాం' అని అనేకసార్లు చెప్పాను. కానీ, 'ఎక్కడో మనిషి అవమానాన్ని భరించలేకపోయాడు' అని, ఆ అవమానాన్ని భరించలేక తనకు నిద్ర కూడా రావడం లేదని కోడెల తనతో గతంలో రెండుమూడుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
 
'ధైర్యంగా ఉండు. అధైర్యపడొద్దు. ఇవన్నీ వాళ్లు కావాలని చేసినప్పుడు మీరు ధైర్యంగా ఫేస్ చేసి, రాష్ట్రంలోని కార్యకర్తలకుగానీ ప్రజలకుగానీ ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని' కోడెలకు చెప్పినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా, ఇబ్బంది అయినా ఎదుర్కొన్న కోడెల తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయారన్నారు. ఇందుకు గల కారణాలను ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉందని, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావని సూచించారు.
 
ఏది ఏమైనా ఒక సహచరుడిని కోల్పోయిన బాధ, సీనియర్ నేతను కోల్పోయిన బాధను మాత్రం భరించలేకపోతున్నానని ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, కోడెల శివప్రసాద్ మానసిక క్షోభకు, భరించలేని అవమానానికి గురయ్యారని, తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. నందమూరి బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మృతి వార్తను చెప్పడంతో షాక్‌కు గురయ్యానని, 'చాలా బాధ కలిగింది, మనసును కలచివేస్తోంది' అని అన్నారు.
 
గత మూడు నెలల నుంచి కోడెల శివప్రసాద రావుకు వేధింపులు ఎక్కవయ్యాయని, వాటిని భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో తాను పల్నాడు ప్రాంతానికి వెళ్లినప్పుడు 'పల్నాడు పులి కోడెల' అనే స్లోగన్స్ వినపడేవని, ఒక టైగర్‌లా ఆయన జీవించారనీ, పార్టీకి ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు