ఈ ఘటనలో 121 మంది భక్తులు చనిపోయారు. ఘటన జరిగిన ఒకరోజు తర్వాత భోలే బాబా ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను వేదికపై నుంచి వెళ్లిపోయాకే తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భక్తులను భోలో బాబా సిబ్బంది తోసేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 'ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నాడు. ఈ సత్సంగ్‌కు దాదాపు రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. బాబా మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వేదిక వద్దకు వచ్చాడు. గంటపాటు కార్యక్రమం కొనసాగిన తర్వాత, 1.40 గంటలకు భోలే బాబా బయటకు వచ్చాడు. వేదిక నుంచి వెళ్లే క్రమంలో దర్శనం కోసం భక్తులు ఆయన వెంట పరుగెత్తారు. ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది' అని దర్యాప్తులో తేలింది.