యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యేడాదికి రెండుసార్లు నిర్వహించే నెట్ ప్రశ్న పత్రాన్ని రూ.500కే అంగట్లో విక్రయించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన వెల్లడించారు. అందుకే ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, డార్క్ నెట్‌లో, టెలిగ్రామ్‍లో పేపర్ షేరింగ్ అయినట్లు గుర్తించి, మరో మార్గంలేక పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో పేపర్ లీక్ కావడం ఓ సంచలనం కాగా.. లీకైన పేపర్‌ను కేవలం రూ.500 లకే అమ్మారని, రూ.5 వేలకూ కొందరు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రతి యేటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ద్వారా సమర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లుగా ఎంపిక చేస్తారు. దీనికోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పోటీ పడుతుంటారు.
ఈ ఏదాది నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ జరిగిందని పలుచోట్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.. అయితే, తర్వాత లీక్ నిజమేనని అంగీకరిస్తూ పరీక్ష రద్దు చేసింది.