లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్న జయలలిత.. అపోలో రోగులకు ఫ్రీ ఆటో..

ఆదివారం, 9 అక్టోబరు 2016 (11:43 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సస్పెన్స్ వీడట్లేదు. గత 18 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయ.. ప్రస్తుతం లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అమ్మకు ఊపిరితిత్తుల సమస్య ఉందని, దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.

ఇకపోతే అమ్మ కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత నెల 22న అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నారు. అమ్మను పరామర్శించేందుకు రాజకీయ నేతలు ఆస్పత్రివద్ద క్యూ కడుతున్నారు. జయలలిత సన్నిహితురాలు శశికళ ఆస్పత్రిలోనే ఉంటూ అమ్మకు సహాయపడుతున్నారు.
 
ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో పూజలు, హోమాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే 'అమ్మ'పై వీరాభిమానంతో ఓ ఆటోడ్రైవర్‌ ఉచితంగా ఆటో నడుపుతున్నాడు. అపోలో రోగుల నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. 
 
అయితే సీఎం ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో భద్రతా కారణాల దృష్ట్యా కుమార్‌ ఆటోను అక్కడి నుంచి పంపించేశారు.

వెబ్దునియా పై చదవండి