దేవీ నవరాత్రులు.. 9 రోజులు 9 వస్త్రాలు, నైవేద్యాల సంగతేంటి?

గురువారం, 7 అక్టోబరు 2021 (11:02 IST)
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున భక్తులు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
ఇకపోతే నేటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కాగా తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. మరి అమ్మవారి ఏరోజు ఎలా అలంకరించాలి ఎలాంటి వస్త్రాలను సమర్పించాలి ఏ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం..
 
మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను, కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. రెండవరోజు అమ్మవారు బాలత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రెండవ రోజు అమ్మవారికి బంగారు వర్ణపు వస్త్రాలతో పూజించి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
 
మూడవ రోజు అమ్మవారికి గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. మూడవ రోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. నేడు అమ్మవారికి బంగారు వస్త్రాలతో అలంకరణ చేసి వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తారు. 
 
నాలుగవ రోజు అమ్మవారికి కాషాయం రంగు వస్త్రాలను, గారెలను నైవేద్యంగా సమర్పించాలి.. ఐదవ రోజు అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు. నేడు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను, దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి.. ఆరవ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆరవ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించి కేసరి నైవేద్యంగా సమర్పించాలి.
 
ఏడవ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాలను సమర్పించి కదంబం నైవేద్యంగా సమర్పించాలి. 8వ రోజు దుర్గాష్టమి ఆకుపచ్చ రంగు వస్త్రాలు సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తారు. నేడు అమ్మవారికి నీలి రంగు వస్త్రాలు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దశమి రోజు అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనం చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు