69 టెలికాం లైసెన్సులను రద్దు చేయండి: ట్రాయ్

డిసెంబర్ 2006లో 2జీ ఫోన్ సర్వీసులకు కేటాయించిన 130 లైసెన్సులకు గానూ.. 69 లైసెన్సులను రద్దు చేయాలని టెలికాం నియంత్రణ అభివృద్ధి సంస్థ (ట్రాయ్) పేర్కొంది. ఈ లైసెన్సులు రద్దు చేయడానికి సదరు లైసెన్సులు పొందిన కంపెనీలు రోల్ అవుట్ నిబంధనలు ఉల్లఘించడమే కారణమని ట్రాయ్ అధికారులు తెలిపారు.

ఆరు కంపెనీలకు ఈ 69 లైసెన్సులను కేటాయించినట్లు వారు తెలిపారు. వీటిలో 20 లైసెన్సులు లూప్‌ టెలికాంకు కేటాయించగా.. ఎటిసలాట్ డిబికు 15, సిస్టెమా-శ్యామ్‌కు 11, వీడియోకాన్‌కు 10, యునినార్‌కు 8, ఎయిర్‌సెల్‌కు 5 లైసెన్సులను కేటాయించారు.

ఇదిలా ఉండగా.. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు (అడాగ్)కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ స్పష్టం చేసింది. జనవరి 2008లో జారీ చేసిన 85 లైసెన్సులలో తమ వద్ద ఎలాంటి లైసెన్సులు లేవని కంపెనీ తెలిపింది.

కాగ్ పేర్కొన్నట్లుగా స్వాన్ టెలికాం లైసెన్సు మంజూరు చేసిన నాటికి ఆ కంపెనీలో తమకు 10.71 శాతం వాటా లేదని తెలిపింది. తమ అనుబంధ సంస్థ అయిన ఆర్ టెలికాం ద్వారా స్వాన్‌లో 9.9 శాతం వాటా ఉండేదని, అది కూడా డిసెంబర్ 2007 వరకు మాత్రమే ఈ వాటా ఉన్నట్లు కంపెనీ వివరించింది.

వెబ్దునియా పై చదవండి