మెట్రో నగరాల్లో తగ్గిన ఉల్లిఘాటు: రూ.పదికే అందుబాటు!!

శుక్రవారం, 24 డిశెంబరు 2010 (10:58 IST)
దేశంలోని ప్రధాన మెట్రోనగరాల్లో ఉల్లిఘాటు గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల పుణ్యమాని ఉల్లిపాయల ధరలు కిందికి దిగిరాక తప్పలేదు. నిన్నమొన్నటి వరకు దేశ వ్యాప్తంగా రూ.60 నుంచి రూ.100 వరకు ఉల్లిధర పలికిన విషయం తెల్సిందే.

ఈ ధరలపై దేశ వ్యాప్తంగా విమర్శలతో పాటు సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా కేంద్రం చొరవ చూపించి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిపాయలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించింది.

ఫలితంగా రూ.60-70 పలికిన ఉల్లిధర ప్రస్తుతం రూ.10కే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది కేవలం మెట్రో నగరాల్లోనే. మిగిలిన ప్రాంతాల్లో కూడా మరో వారం రోజుల్లో ధరలు దిగివస్తాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఉల్లిధరలు ఒక్కసారి పెరగడం ఆహార ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపింది. డిసెంబరు 11వ తేదీతో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 12.13 శాతంగా నమోదైంది. అంతకుముందు వారం ఇది సింగిల్ డిజిట్‌గా ఉన్న విషయం తెల్సిందే.

ఇదిలావుండగా ఉల్లిధరలను ఎప్పటికపుడు సమీక్షించేందుకు కేబినెట్ సెక్రటరీ కేఎం.చంద్రశేఖర్ నేతృత్వంలో కార్యదర్శుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఉల్లి ధరపై సమీక్ష జరుపుతూ పరిస్థితిని అంచనా వేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల సరఫరాకు రైల్వేలు మరిన్ని గూడ్స్ వ్యాగన్లను కేటాయించాలని కోరినట్టు చంద్రశేఖర్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి